Saturday, September 13, 2008

ఎంతందంగా ఉంటుందో...



పొద్దున్నే లేచి హాయిగా అలా అలా నడుస్తూ నాతో నేను మాతాడుకుంటూ ప్రకృతిని చూసి పులకించి పోతే...! ఓహ్! ఆ ఆనందమే వేరు. ఒక సారి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు పొద్దున్నే లేచి మా ఇంటి చుట్టూ ఉన్నా రోడ్డులలో తిరిగొచ్చాను. అది చలి కాలం. తెల్లవారుఝామున పూట అలా అలా తిరుగుతుంటే ఎంత బాగుంటుందో కదా! అంతకుముందు రోజు నాకు ఎందుకో చికాకుగా ఉంది. ఈ దెబ్బతో ఆ చికాకు అంతా పోయింది.
ఒక సారి నాకు జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నాను. వైష్ణవి బడికి వెళ్ళింది. నాకేమో ఏమీ తోచటంలేదు. ఇంట్లో అమ్మ బ్యాంకు కి వెళ్ళింది. నాతో పాటే ఇంట్లో ఉంది నాయనమ్మే. తనేమో పూజలలో తలమునకలై ఉంది. పడుకుని పడుకుని నాకు మహా విసుగేసి కొంసేపు వరండా లోకి వెళ్లాను. తలంతా దిమ్ము గా ఉంది. నేను గ్రిల్ల్స్ వైపు నిరాసక్తంగా చూస్తుండగా ఒక పిచ్చుక వచ్చింది. అది ఎంత ముద్దుగా ఉందో. అది నెల మీద వాలి అక్కడ నాయనమ్మ ఏరి పడేసిన బియ్యం గింజలనీ, పురుగులనీ తింటోంది.
నాకు చాలా ముచ్చటేసింది. కొంసేపు దాన్ని అలా చూస్తూ గడిపేసరికి జ్వరం వల్ల వచ్చిన చిరాకు అంతా పోయింది. అదెక్కడ ఎగిరి పోతుందో అని నేను లోపలకి వెళ్లి కొన్ని గింజలని తీసుకు వచ్చి కొంచం దూరంగా వేశాను. అది తింటుందేమో అని. అది నెమ్మది నెమ్మది గా తన ముందు ఉన్నా వాటిని తిని, కాసేపు నా వైపలా అనుమానంగా చూసింది. నేనేదేమన్నా ట్రాప్ చేస్తానేమో అని. నేనూ దాని వైపలా అమాయకం గా రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉన్నాను. అది ఏమనుకుందో ఏమో నన్నొదిలేసి, నేను వేసిన గింజలని తినటం మొదలెట్టింది.
నాకిదంతా సరదాగా అనిపించింది. దాని బుజ్జి బుర్రలో ఎన్ని ఆలోచనలో కదా! నేనేదేమయినా చేస్తానేమో అని ఎంత జాగ్రత్త. నా వల్ల ప్రమాదం లేదని నిర్ణయించుకునే దాకా అది నేను వేసిన గింజలని అది ముట్టు కోలేదు.
లండన్ లో కూడా పావురాలకి నేను కొన్ని సార్లు గింజలని వేశాను.
అలాగే ఏదయినా పిల్ల కాలువలో చేప పిల్లలని చూస్తున్నా సమయం తెలీకుండా గడిచి పోతుంది. అస్సలు దేవుడి సృష్టి అంతా ఎంత ఎండంగా ఉంటుందో కదా...
మనసుకి ఏదయినా కష్టం కలిగితే ఒక చీమ పాకే దారినీ అది తన గతిని చీటికీ మాటికీ మార్చుకుంటాం చూస్తె మన మొహాన చిరునవ్వొకటి వెలుస్తుంది. అది చాలు ఎంతటి విసుగైనా తగ్గటానికి.
ఒక విషయం చెప్పనా చీటికీ మాటికీ తన మార్గాన్ని మార్చుకుంటుంది కనుకే దానిని చీమ అంటారు.
ఎలా ఉంది నా డెఫినిషన్? :-)
ఇప్పుడు ఆ పిచ్చుకలూ పావురాళ్ళు ఏమయి పోయాయి. నా చిన్ని నేస్తం పిచ్చుక కోసం మొన్నీ మధ్య భారతదేశానికి వచ్చినప్పుడు ఎంత వెతికినా కనపడలేదు. మీకేమయినా కనిపిస్తే నాకు చెపుతారా?

5 వ్యాఖ్యలు:

Falling Angel on September 14, 2008 1:31 AM said...

పొద్దున్న లేస్తే నిజంగా బానే ఉంటుంది, కానీ లేవడమే... కొంచెం కష్టం ;)

మీకు హైద్రాబాద్‍లో పిచ్చుకలు కనబడే ఛాన్సేలేదు. పల్లెకీ సిటీకీ మధ్యలో ఉండి, ఉన్నంతలో కాస్త పచ్చగా ఉన్న మా ఊళ్ళోనే ఈమధ్య నేను పిచ్చుకల్ని చూడలేదు.

కానీ బెంగళూరులో మాత్రం బానే కన్పిస్తున్నాయి.

Purnima on September 14, 2008 2:29 AM said...

నిజమే.. పిచ్చుకలు అసల్లేవు ఈ రోజుల్లో. మా ఇంట్లో బోలెడు చెట్లు ఉండేవి కనుక, పక్షులు బాగా వచ్చేవి. పిచ్చుకలతో నాది మంచి దోస్తీ ఉండేది. ఇప్పుడసలు కనిపించటమే లేదు.

>> దాని బుజ్జి బుర్రలో ఎన్ని ఆలోచనలో కదా.. :-) అవును. నాకు రస్కిన్ బాండ్ ది ఒక కథ గుర్తుకు వస్తుంది. The Leopard కథ పేరు. అడవి గుండా రోజూ ఒక మనిషి వెళ్ళటం గమనించి, ముందు కంగారు పడినా, తనకెలాంటి హాని చెయ్యని మనిషి అని Leopard తెలుసుకుని, మనిషిని పూర్తిగా నమ్మేస్తుంది. ఆఖరకి వేటగాళ్ళ చేతిలో చిక్కి చనిపోతుంది. మర్నాడు ఉదయం, రోజూ వళ్ళే మనిషి అనుకుంటాడు..

Perhaps I made him confident-too confident, too careless, too trusting of the human in the midst...
..But did the leopard trusting one man, make the mistake of bestowing his trust on others? Did I , by casting out all the fear--my own fear, and the leopard's protective fear--leave him defenseless?

మంచి కథ. చదవకపోయుంటే చదవండి.

అందమైన టపా అందించినందుకు ధన్యవాదాలు!

@falling angel: True!

పూర్ణిమ

సుజాత on September 14, 2008 5:02 AM said...

చిన్ని చిన్ని విషయాల్లో ఆనందాన్ని ఎంత బాగా అనుభవించారో బాగా వర్ణించారు. పొద్ద్దున్నే లేచి నడవటంలో ఉన్న ఆనందాన్ని ఎప్పుడూ మిస్ కాకూడదు. లేచే వరకే బద్ధకం!

మీ అనుభవాలు వింటుంటే నా గురించే చెప్పినట్టుగా అనిపించింది. డల్లాస్ లో ఉండగా నేనూ బాల్కనీలోకి వచ్చే పేరు తెలియని పక్షులకు బియ్యం, పెసరపప్పు, వంటి గింజలు వేసేదాన్ని. మొదట్లో ముట్టుకోకపోయినా రాను రాను తినేవి. ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే రేపటినుంచి గింజలు లేక ఎదురు చూస్తాయేమో అనిపించి ఎంత బాధ వేసిందో!

పిచ్చుకలు హైదరాబాదులో సిటీలో అంతగా కనపడవు గానీ,out skirts లో మా ఇంటి దగ్గర (బోలెడు చెట్లు పెంచాము మరి) వస్తుంటాయి. మేము పక్షులకోసం పెట్టిన గూడు వద్దకు వచ్చి అప్పుడప్పుడు గింజలు తింటాయి. పల్లెల్లో ఇప్పుడూ కనపడుతుంటాయి.

సిరిసిరిమువ్వ on September 14, 2008 6:56 AM said...

పొద్దున్నే లేచి నడవటంలో ఉండే ఆనందమే వేరు. ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని అనుభూతులు....
బాగా రాసారు.

సందీప్ on September 15, 2008 12:16 PM said...

మీ బ్లాగులో నచ్చే విషయం చెప్పనా!
మీ మాటలు చదువుతుంటే, చదువుతున్నట్టు ఉండదు.
మీ ఇంటికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ముందు పకోడీల
ప్లేటు పెట్టి "అప్పుడేం జరిగిందో చెప్పనా?" అని మీరు నాతో కబుర్లు చెబుతున్నట్టు ఉంటుంది. (రాయటం కూడా మీ మాటలు అని వచ్చేసింది చూసారా!)

I really like ur way of writing!

అలా వెళ్ళొచ్చేవి...

  • MOTORCYCLE DIARIES: The Fatal Night - 1 - Dhanaraj Manmadha Says... August 24, 2009, Hyderabad. టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ పిలుస్తుంటే కలత నిద్రలోంచ...
    15 hours ago
  • సెలవురోజులొచ్చాసాయే బ్లాగు! - మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. ఈ వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక ...
    1 day ago
  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    1 day ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    2 days ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    3 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez